మహిళా విముక్తి - ఎంగెల్స్‌



మహిళా విముక్తి - ఎంగెల్స్‌ 
——————————————

మహిళా విముక్తి కోసం ఎంగెల్స్‌ తన రచనల ద్వారా అందించిన చారిత్రాత్మక అవగాహన కాలం గడిచినా పదును తగ్గలేదు. ఎంగెల్స్‌ మార్క్స్‌ ఉమ్మడిగా శాస్త్రీయ సోషలిస్టు సిద్ధాంతం, దాని ఆచరణ గురించిన సిద్ధాంతాన్ని కనుగొన్నారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది మహిళలపై వ్యవస్థీకృత వివక్ష, వారిపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా చేసే పోరాటాలకు వెలుగును అందిస్తుంది. అభిóవృద్ధి చెందిన ఆధునిక పెట్టుబడిదారీ సమాజంలో కూడా మహిళలపై వివక్ష, హింస కొత్త రూపాలలో కొనసాగుతున్నాయి.

మహిళలు రెండో శ్రేణి మనుషులనీ, దానికి వారి శరీర నిర్మాణం, వారి మానిసిక స్థితే కారణం అనే పాలకవర్గాల తప్పుడు వాదనలను, కట్టు కథలను ఎంగెల్స్‌ బట్టబయలు చేశారు. మత గ్రంథాలు కూడా మహిళలను రెండో శ్రేణి మనుషులుగానే చిత్రిస్తున్నాయని, వర్గ సమాజంలోని పాలకవర్గాలు శత్యాబ్దాల నుంచి ప్రచారం చేస్తున్నాయి. వాటి గుట్టును ఎంగెల్స్‌ బహిరంగపరిచారు.
పెట్టుబడిదారీ వ్యవస్థ తొలిరోజుల్లో మహిళలు, బాల కార్మికులపై జరిగే ఆటవికమైన క్రూర వర్గదోపిడీని ఎంగెల్స్‌ ఎత్తిచూపుతూ, ఈ దోపిడీ విధానాన్ని పెట్టుబడిదారీ దోపిడీ వ్యవస్థలోని బాల్య దశ అని వివరించారు. ఆయన వాస్తవాల నుంచి సత్యాన్ని గ్రహించడం అనే విధానాన్ని రూపొందించి ఉన్నత ప్రమాణాలను ఏర్పాటు చేశారు.

మహిళలు - బాలకార్మికులు పెట్టుబడిదారీ వ్యవస్థలో కార్మికులను ఎలా దోపిడీ చేస్తారనే అంశాన్ని వివరిస్తూ తన 24వ ఏటనే ఎంగెల్స్‌ ''ఇంగ్లాండులో కార్మికవర్గం''పై ఒక ప్రామాణిక గ్రంథాన్ని రచించారు. ఈ పుస్తకం కార్మికులను పెట్టుబడిదారీ వ్యవస్థలో ఎలా దోపిడీ చేస్తారనే అంశాన్ని కండ్లకు కట్టినట్టు వివరిస్తుంది. ఈ పుస్తక రచనలో మేరి మార్న్స అనే ఒక ఐరీష్‌ మహిళ ఎంగెల్స్‌కు సహకరించింది. తరువాత కాలంలో ఆమె ఆయన జీవిత భాగస్వామి అయింది. ఆ పుస్తకాన్ని ఎంగెల్స్‌ ఇంగ్లాండ్‌ కార్మిక వర్గానికి అంకితమిస్తూ ఇలారాసారు.. ''నేను అనేక అధికార, అనధికార పత్రాలను చదివినప్పటికీ నాకు సంతృప్తి కలగలేదు. నాకు ఈ అంశంపై పూర్తి అవగాహన కావాలని తపిస్తున్నాను. అందుకే మిమ్మలను మీ ఇంటివద్దే కలిసి, మీ రోజువారీ జీవితం ఎలా ఉంటుంది, మీరు ఎలా బతుకుతున్నారు, మీ సాధక బాధకాలు తెలుసుకోవడానికి మీతో మాట్లాడాలని వచ్చాను.'' ప్రత్యక్ష అనుభవం, ప్రభుత్వ పత్రాల అధ్యయనం అనే రెండు కోణాల నుంచి జరిగిన అధ్యయనం కావడంతో పెట్టుబడిదారీ దోపిడీ ఎంత క్రూరంగా ఉంటుందో కండ్లకు కట్టినట్టు బట్టబయలు చేయగలిగారు.

ఎంగెల్స్‌ ఇంగ్లండ్‌లోని జౌళి, దుస్తులు, రెడీమెడ్‌ బట్టలు తయారు చేసే పరిశ్రమలలో మహిళలు, బాల కార్మికులను ఎలా ప్రవేశపెట్టారు అనే అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టి అధ్యయనం చేశారు. దీనితోనే మహిళలు, బాల కార్మికులు ఎంత దారుణమైన పరిస్థితులలో పనిచేస్తున్నారనేది మొట్టమొదటిసారి ప్రపంచానికి వెలుగులోకి వచ్చింది. పురుష కార్మికుల స్థానాన్ని యంత్రాలు ఎలా ఆక్రమిస్తున్నాయి అనేదానితో పాటు మహిళలను, బాల కార్మికులను పరిశ్రమలలో ఎలాంటి పనులలో ప్రవేశపెడుతున్నారు అనేది ఈ అధ్యయనంలో తెలియవచ్చింది. ఉత్పత్తి క్రమంలో ఉన్న ప్రతి ప్రక్రియను ఎంగెల్స్‌ క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. వస్త్ర పరిశ్రమలో బట్టలు నేస్తున్నప్పుడు తెగిపోయిన దారాలను ముడివేయాల్సిన పనికి కండబలం అవసరం లేదని, వేళ్ళు సున్నితంగా కదిలితే సరిపోతుందని, ఇలాంటి పనులలో పురుషులను తొలగించి మహిళలను, బాల కార్మికులను పెట్టుకుంటే తక్కువ ఖర్చుతో పని పూర్తిచేయవచ్చని గ్రహించారు. దీని ఆధారంగా అధ్యయనం చేస్తే నూలు మిల్లులో 56శాతం మంది మహిళలు ఉన్నారని, ఉన్ని మిల్లులో 69శాతం, సిల్క్‌ మిల్లులో 70శాతం మహిళా కార్మికులే ఉన్నారని, అందువల్లనే విపరీతమైన లాభాలు వస్తున్నాయని తెలియవచ్చింది.

పెట్టుబడిదారులు, కార్మికుల మధ్య దోపిడీ సంబంధాలు కేవలం పని స్థలాలలోనే ఉండవనీ, అవి కార్మికుడి జీవితంలోని అన్ని కోణాలనూ ప్రభావితం చేస్తున్నాయనీ యువకుడైన ఎంగెల్స్‌ గ్రహించారు. అందుకే ఆయన అధ్యయనాన్ని ఇక్కడికే పరిమితం చేయలేదు. పెట్టుబడిదారీ పారిశ్రామికీకరణ అనేది విశాల ప్రాతిపదికమీద కుటుంబ సంబంధాలను ఎలా చిధ్రం చేస్తుందో, మహిళలలు, బాల కార్మికులు ఎంత దారుణంగా బతుకులు ఈడుస్తుంటారో, కార్మిక కుటుంబాలు ఎలా విడిపోతాయో అర్థం చేసుకున్నాడు. దీనికి దారుణమైన చట్టాలు ఎలా కారణం అవుతాయో కూడా గ్రహించాడు. తొలి రోజుల్లో ఆయన అధ్యయనం చేసిన కార్మిక కుటుంబాలు ఎలా ఉంటాయి అని అనుభవంతో నేర్చుకున్న విషయాలు తరువాత కాలంలో పెట్టుబడిదారీ కుటుంబ వ్యవస్థలో ఏర్పడిన కపటత్వాన్ని విమర్శించడానికి ఆయనకు ఉపయోగపడ్డాయి.
మహిళలకు ఉద్యోగాలు ఇవ్వడాన్ని పురుష కార్మికులు వ్యతిరేకించేవారు. ఎందుకంటే వారి ఉద్యోగాలు పోతాయని. అయితే మార్క్స్‌, ఎంగెల్స్‌ మాత్రం అనేక సందర్భాలలో మహిళలు ఉద్యోగాలు చేయడాన్ని సమర్థించారు. 

1866లో కార్మిక సంఘం వారు వేతనంపై మహిళలను పనిచేయించడాన్ని నిషేధించాలని తీర్మానం ప్రవేశపెడితే మార్క్స్‌ ఎంగెల్స్‌ ఇద్దరూ దాన్ని వ్యతిరేకించారు. కొన్ని సంవత్సరాల తరువాత ఇదే డిమాండ్‌ మళ్ళీ కొంతమంది ట్రేడ్‌ యూనియన్‌ నాయకులు లేవనెత్తితే, 1885లో ఒక మిత్రుడికి ఎంగెల్స్‌ లేఖరాస్తూ పురుషులకైనా, మహిళలకైనా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సోషలిస్టులు ఎవరైనా అంగీకరిస్తారని, మహిళా కార్మికులకు ప్రత్యేక రక్షణ ఏర్పాటు ్లపెట్టుబడిదారీ దోపిడీ వ్యవస్థలో తప్పనిసరి అని, అది వారి భౌతిక పరిస్థితుల వలన అవసరం అని తెలియచేశారు. 1886లో రెండవ ఇంటర్నేషనల్‌లో ఒక తీర్మానంలో ''పురుష కార్మికులు విధిగా మహిళా కార్మికులను వారితో సమాన శ్రేణులలోకి ఆహ్వానించాలని, సమాన పనికి సమాన వేతనం అనే సూత్రానికి అనుగుణంగా ఇది జరగాలని'' తీర్మానించారు.

మహిళలపై హింసకు పునాది ఎంగెల్స్‌కు ఆయన కాలంలోని సంఘ సంస్కర్తలకు ఉన్న మౌలిక వ్యత్యాసం ఏమిటంటే ఆయన వారిపై హింసకు ఉన్న కారణాల పునాదులపై కేంద్రీకరించి మహిళలను రెండవ తరగతి వాళ్ళగా చూపేందుకు ఉన్న భౌతిక పరిస్థితులు, కారణాలు, వాటిని ఎలా ఎదుర్కోవాలి, సామాజిక పరిస్థితులను ఎలా మార్చాలి అనే వాటిని బట్టబయలు చేశారు. కుటుంబం వ్యక్తిగత ఆస్తి, రాజ్యాంగ యంత్రం పుట్టుక అనే పుస్తక రచన ఆయన ఈ కోణంపై దృష్టి సారించడానికి పురికొలిపింది.

ఈ పుస్తకం మొదటి ముద్రణ 1884లో విడుదలైంది. మారగాన్‌ రాసిన ప్రాచీన పురాతన సమాజం అనే పుస్తకం, దానిపై మార్క్స్‌ రాసుకున్న నోట్స్‌ ఆధారంగా ఎంగెల్స్‌ వర్గం సమాజం అభివృద్ధి క్రమంలో మహిళలను ఏవిధంగా బానిసలుగా మారుస్తారనేది వివరించారు. పెట్టుబడిదారీ సమాజంలో కూడ అదికొనసాగుతున్నది. మహిళలు అనే అంశాన్ని భౌతికవాద దృక్పథంతో ఎంగెల్స్‌ ప్రత్యేకంగా అధ్యయనం చేయడం ఒక ముందడుగు. ఉత్పత్తిశక్తుల అభివృద్ధి, ఉత్పత్తి శక్తులపై యాజమాన్యం అనేవి ఆ సమాజంలో సామాజిక సంబంధాలను, అందులో భాగంగా ఆడ మగ మధ్య సంబంధాలను, కుటుంబ వ్యవస్థను నిర్ణయిస్తాయి. మాతృస్వామిక సమాజంలో ఉత్పత్తి శక్తులు బలహీనంగా ఉండటంతో అదనపు ఉత్పత్తి లేకపోవడంతో సమానత్వం ఉండేదని తెలియచేశారు. ప్రాచీన సమాజంలో స్త్రీలు కీలకపాత్ర వహించేవారని జీవితావసర వస్తువుల ఉత్పత్తి, పునరుత్పత్తిలో వారే కీలకమని దానితోనే జాతి మనుగడ సాగేదని తెలియచేశారు. ఈ మధ్యలో లభ్యమైన పరిశోధనా పత్రాలలో ఆహార పదార్థాల సేకరణే కాకుండా వేటాడంలో కూడా స్త్రీలు పాల్గొనట్టు తెలియవస్తున్నది.

కుటుంబ వ్యవస్థ పరిణామ క్రమంలో అనేక దశలు ఉన్నాయి. మొదట అందరు పురుషులకు అందరు మహిళలకు చెందినవారే అనే పద్ధతి నుంచి జంట పెండ్లి వచ్చింది. దీనికి సహజ ఎన్నిక పునాదిగా ఉంటుంది. సహజ ఎంపిక అనేది ప్రగతి శీలమైనది, సమాజం పురోగమనంలో మంచి ఫలితాలు ఇస్తున్నది. అందుకని దీని స్థానంలో మరో విధానం ప్రస్తుతం అవసరం లేదు. కొత్త ఉత్పత్తి సంబంధాలు ఏర్పడేదాకా ఇవే కుటుంబ సంబంధాలు సరిపోతాయని ఎంగెల్స్‌ తెలియచేశాడు.
ఉత్పత్తి శక్తులు అభివృద్ధి అయి, సమాజ అవసరాలకు మించి మిగిలి అదనపు ఉత్పత్తి జరిగినప్పుడు సమాజ నిర్మాణంలో మౌలిక మార్పుకు అవసరం ఏర్పడి కొత్త సామాజిక సంబంధాలు అమలులోకి వచ్చాయి. ఉత్పత్తి శక్తులు, అదనపు ఉత్పత్తి కొంత మంది మధ్యలోకి పోయినప్పుడు వర్గ వైరుధ్యం పుట్టింది. ఉమ్మడి సొత్తుగా ఉన్నది వ్యక్తుల సొంతం కావడంతో వ్యక్తిగత ఆస్తి పుట్టింది. ఈ సందర్భంలో సమాజంలో మహిళ స్థానంలో మార్పు జరిగింది. ఉత్పత్తి పరికరాలు పురుషుల సొంతం అయినాయి. దీనితో వారసత్వం అనేది కీలకంగా మారింది. అందుకని స్త్రీ ఎవ్వరి సొంతం అయితే దానిని బట్టి వారి వారసత్వం నిర్ణయించబడేది. ఈ పురుషుడు ఏ స్త్రీ సంతానం అనేది కీలకంగా మారింది. వారిని పెంచడం, పోషించడం అనేది స్త్రీ మాత్రమే చేయగలదు. దానితో అనివార్యంగా భర్తయొక్క పెత్తనం కింద స్త్రీ ఉండిపోయింది. స్త్రీని పురుషుడు చంపినా ఆయన తన హక్కును వినియోగించినట్టు భావించారని ఎంగెల్స్‌ తెలియచేశారు. ఏకపత్ని విధానం ఒక పద్ధతిగా ఏర్పడింది.

ఏకపత్ని విధానం అనేది ఆర్థిక పరిస్థితుల ఆధారంగా ఏర్పడిన కుటుంబ వ్యవస్థ. అంటే సొంత ఆస్తి అనేది ఉమ్మడి ఆస్తిపై పైచేయి సాధించిన తరువాత ఇది ఏర్పడిందని ఎంగెల్స్‌ అన్నారు. సమాజ చరిత్రలో మొట్టమొదటి వర్గ వైరుధ్యం అనేది స్త్రీ పురుషుల మధ్య ఏర్పడింది. మొట్టమొదటి అణచివేత కూడా ఏకపత్ని కుటుంబ వ్యవస్థలోని స్త్రీని పురుషుడు అణచి ఉంచడంలో కనబడుతుంది. తల్లిగా ఏర్పడిన హక్కును తొలగించడంలో ప్రపంచ చరిత్రలో స్త్రీ మొదటి సారి ఓటమిపాలైంది అని ఎంగెల్స్‌ చెపుతారు. వ్యక్తిగత ఆస్తి రద్దు అయినప్పుడే మహిళా విముక్తికి దారి తెరుచుకుంటుంది.

సోషలిస్టు ప్రత్యామ్నాయాన్ని ఎంగెల్స్‌ ముందుకు తెచ్చారు. అందులో వ్యక్తిగత ఆస్తిని రద్దు చేయాలని, దానితో పురుషాధిక్యతలో నడుస్తున్న ఏకపత్ని కుటుంబ వ్యవస్థకి అంతం పలకవచ్చని చెపుతూ ఉత్పత్తి శక్తులు సమాజ ఆస్తిగా మారడం దీనికి కీలకం అని తేల్చిచెప్పాడు. పరిసరాలు శుభ్రపర్చుకోవడం అనేది సమాజ పరం కావాలని, పిల్ల పెంపకం, చదువు కూడ సమాజ బాధ్యతగా ఏర్పడాలని, ఈ చర్యలే సోషలిస్టు ప్రత్యామ్నాయం అవుతాయని చెప్పారు. రష్యాలో మొదటి సోషలిస్టు సమాజం ఏర్పడి, వీటిని ఆచరణలో పెట్టడంతో అది రుజువైంది.

ధనవంతుల కుటుంబాలలో పురుషుడు పెట్టుబడిదారుడు, స్త్రీ కార్మికురాలుగా భావించబడుతారు. స్త్రీని పని మనుషులలో పెద్ద పనిమనిషిగా మాత్రమే గుర్తిస్తారు. ఇక్కడే ఎంగెల్స్‌ ధనవంతుల కుటుంబాలకు, కార్మిక కుటుంబాలకు గల తేడాను చూపిస్తారు. పెద్ద పరిశ్రమలు ఏర్పడటం స్త్రీని ఇంటి బైటికి పనిచేసేందుకు తీసుకు వచ్చింది. దానితో ఆమె కుటుంబ పోషకురాలిగా అవతరించింది. దీనితో పురుషాధిక్యతకి కాలం చెల్లినట్టు అయింది. పెట్టుబడిదారీ వ్యవస్థ అంతం అయి సోషలిస్టు వ్యవస్థ ఏర్పడటమే స్త్రీ విముక్తికి దారి వేస్తుందని రుజువైంది.

- బృందా కరత్‌
- అనువాదం:టిఎన్‌.వి. రమణ

Comments

Popular posts from this blog

రాజ్యాంగ హక్కులు _మహిళలు