అంతర్జాతీయ మహిళా దినోత్సవం

         1908లోనే మహిళా ఉద్యమం 
బాటలు పడ్డాయి. న్యూయార్క్ లోని వస్త్ర తయారీ రంగంలోని మహిళా కార్మికులు సమ్మెకు దిగారు. వీధుల్లో ప్రదర్శనలు చేశారు. తమ పనిలో అమానవీయ దోపిడికి వ్యతిరేకంగానూ, సమాన వేతనం  డిమాండ్ చేస్తూనూ ధిక్కార స్వరం వినిపించారు. పురుషులతో సమానంగా తమకూ ఓటు హక్కు కావాలని నిలదీశారు. ఏడాది తర్వాత 1909 లో అమెరికన్ సోషలిస్టు పార్టీ పిలుపుమేరకు చరిత్రలో మొట్ట మొదటి సారి 'నేషనల్ ఉమెన్స్ డే' ని అమెరికా వ్యాప్తంగా ఫిబ్రవరి 28న  జరుపుకున్నారు.


ప్రపంచవ్యాప్తంగా, కోవిడ్ కారణంగా, మహిళలు ఉపాధి కోల్పోయి 800 బిలియన్ డాలర్లు  నష్టపోయారు. 2021సంవత్సరంలో 47 మిలియన్ల మహిళలు పేదరికంలో కూరుకు పోయారు. మన దేశంలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. మహిళలు అత్యధికులు అసంఘటిత రంగంలో పనిచేస్తారు కనక వారి ఆదాయాలు కుంచించుకు పోయాయి. మహమ్మారి కాలంలో వేతనం లేని పని పెరిగింది. కుటుంబంలో పని భారం పెరిగింది. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గి గ్రామీణ మహిళలు నష్టపోతున్నారు. ఏ స్థాయి ఆర్థిక సంక్షోభానికి భారతీయ మహిళలు గురయ్యారన్నది లెక్కకు అందని విషాదం. అంతేకాదు, కోవిడ్ కాలంలో గృహహింస, లైంగిక దాడులు పెరిగాయి.

మన దేశంలో 2023 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో మహిళలకు కేటాయింపులు 4.4 శాతం నుండి 4.3 శాతానికి పడిపోయాయి. మహిళా శిశు సంక్షేమ శాఖకు మొత్తం బడ్జెట్ ఖర్చులో 0.57 % నుండి 0.51 శాతానికి తగ్గించారు. పిల్లల పోషకాహారానికి తగిన కేటాయింపులు లేవు. స్కీం వర్కర్లకు గౌరవ వేతనాలు తప్ప గౌరవప్రదమైన వేతనాలు లేవు. కేంద్రం గొప్పగా చెప్పుకునే భేటీ బచావో తదితర అనేక మహిళా సంక్షేమ పథకాలకు మొత్తం కలిపి బడ్జెట్ కేటాయింపులు 587 కోట్ల నుంచి 562 కోట్లు తగ్గించారు. 

గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2021 ప్రకారం, ప్రపంచంలోని 156 దేశాల్లో భారతదేశ స్థానం 140. ఇది గతం కంటే 28 స్థానాలు పడిపోయింది. దక్షిణాసియా దేశాల్లో మన స్థానం మరీ అన్యాయం. ఆరోగ్యం, విద్య, రాజకీయ భాగస్వామ్యం, ఆయుఃప్రమాణం తదితర అనేక అంశాల ఆధారంగా ఈ ఇండెక్స్ ను లెక్కగడతారు కేంద్రంలో  బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక  పురుషాధిక్య భావజాలం వ్యవస్థీకృత రూపం తీసుకుంది. మైనారిటీ మహిళలు. దళిత మహిళలు ఈ కాలంలో దేశంలో మరింత ఎక్కువ అణచివేతకు గురయ్యారు. ప్రస్తుత పరిస్థితుల్లో మహిళల సంక్షేమం కోసం పని చేయడం అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక, సాంస్కృతిక విధానాలకు  వ్యతిరేకంగా పని చేయడమే!

 

అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో,

Comments

Popular posts from this blog

ప్రభుత్వరంగం -మహిళలు

రాజ్యాంగ హక్కులు _మహిళలు