సమాజం పరిణామం_ స్త్రీలు



సమాజం పరిణామం_ స్త్రీలు
                ___పిళ్లా కుమారస్వామి,9490122229

 మానవ పరిణామం

           భూమి ఏర్పడిన తర్వాత భూమిపై అనేక జీవరాసులు పరిణామక్రమంలో ఏర్పడ్డాయి .ఒక దశలో అత్యధిక హిమపాతం కలిగిన భూమిని అంతరిక్షం నుంచి వచ్చిన ఆస్టరాయిడ్ శకలాలు తగలడం వల్ల అనేక వృక్షాలు జంతువులు మరణించాయి. ఆ సందర్భంలో  భూమి పైన అనేక గడ్డి మైదానాలు ఏర్పడ్డాయి. ఉత్తరకెన్యా, ఈశాన్య ఇథియోపియాలో లేక్   రుడాల్ఫ్ గడ్డి మైదానాలలో మానవ పరిణామ క్రమం ప్రారంభమైందనిఅందరూ అంగీకరిస్తున్నారు. అప్పుడు కొన్ని వేల సంవత్సరాలుగా  నడిచే వానరాలు చెట్ల మీద నుంచి భూమి మీదికి ఆహార సేకరణ కోసం చాలా దూరం గడ్డి  మైదానాల పై నడుస్తూ  వెళ్లాల్సి వచ్చేది. ఆ క్రమంలో లో వానరాలు నిలబడటం అలవాటు చేసుకున్నాయి. వెనుక కాళ్ళు మొత్తం శరీరాన్ని మోయగల శక్తిని సంపాదించు కున్నాయి. కాలి వేళ్ళు భూమిని పట్టుకు నేందుకు అనువుగా పాదం వెడల్పుగా తయారైంది. అప్పుడు ముందు కాళ్ళు స్వేచ్ఛను పొందాయి. కాలక్రమంలో అవి మనిషి చేతులు గా రూపాంతరం చెందాయి. చెట్లు ఎగబాకే టప్పుడు, పళ్ళు ,కాయలు దుంపలు ఏరుకొనేటప్పుడు, రాళ్లను ఉపయోగించేటప్పుడు జరిగిన శ్రమవల్ల చెయ్యి నిర్మాణం అభివృద్ధి చెందింది. రకరకాల వస్తువులు పట్టుకునేందుకు బొటనవేలు మిగతా వేళ్ల కన్నా ఎడం అయింది.
స్వేచ్ఛ పొందిన చేతులతో ఆహార సంపాదన ఆత్మరక్షణ చేసుకోగలిగాడు. ఇదంతా 20 లక్షల సంవత్సరాల క్రితం జరిగింది.మూడు కోట్ల సంవత్సరాల కిందట మొదలైన వానర ప్రస్థానం 20 లక్షల సంవత్సరాలు వచ్చేటప్పటికి మనిషి గా మారి నిటారుగా నిలిచి నడవటం నేర్చాడు. 10 లక్షల సంవత్సరాలు గడిచే టప్పటికి మానవుడిగా రూపాంతరం అయ్యాడు. ఇతనిని పెకింగ్ మాన్ అని కూడా అన్నారు. 2 లక్ష సంవత్సరాల కిందటరెండవ సారి వచ్చిన హిమయుగాన్ని ఆనాటి మనిషి తట్టుకొని నిలబడ్డాడు. గుహల్లో అగ్ని రగిల్చాడు .బల్లెం, బరిశ ,గది లాంటి ఆయుధాలను, రెండు వైపులా మొనదేలిన ఆయుధం మొదలైన వాటిని తయారు చేసుకున్నాడు .జంతువులను మచ్చిక చేసుకున్నాడు నిప్పును తయారు చేయడం నేర్చుకున్న మనిషి జీవితం పూర్తిగా మారిపోయింది. దీంతో మనిషి జంతువులతో వాన రాలతో విడిపడినట్లైంది. ఆనాటి మనిషి అంగ నిర్మాణానికి మన అంగ నిర్మాణానికి చాలా తేడా ఉంది. చిన్న నుదురు చిన్న ముక్కు, చిన్న చెవులు ,వంగిన నడుము, ఎక్కువ రోమాలు ఎత్తుగా పొడుచుకువచ్చినట్లు కనుబొమ్మలు, నాలుగడుగులు ఎత్తు. ఇది ఆదిమానవుని రూపం .అతని మెదడు బరువు నరవానరాలు మెదడు కన్నా పెద్దది. నేటి మనిషి మెదడు కన్నా చిన్నది. ఆధునిక  మానవుని అంగ నిర్మాణం 30000సంవత్సరాల క్రితం ఏర్పడింది .క్రీ.పూ.10000 సంవత్సరాల ప్రాంతంలో  ఒక పెద్ద ప్రేలుడు లాంటిదేదో సంభవించి మంచు యుగానికి ముగింపు పలికిందని  పలువురు శాస్త్రవేత్తలు భావించారు. అంటే మానవుని నాగరికత ప్రారంభమై కేవలం 12000 సంవత్సరాలు మాత్రమే అయింది.
       మనిషి తన ప్రస్థానాన్ని ఆఫ్రికా నుండి ప్రారంభించాడు నాగరికతను తూర్పు దేశాలలో వికసింపజేసినాడు.క్రీస్తుపూర్వం 10 వేల ఏళ్ళనాడే కుక్కల్ని మేకల్ని గొర్రెల్ని మచ్చిక చేసుకోవడం నేర్చుకున్నాడు జంతువులు చంపడం మానేసి వాటిని పెంచడం ద్వారా ఆహారాన్ని సంపాదించుకోవడం సులభం అని అర్థమైంది. క్రీ.పూ. 5000 నాటికే గుర్రాలను మచ్ఛిక చేసుకున్నాడు
 క్రీస్తు పూర్వం 2000 ప్రాంతంలో మనిషి గుర్రాల స్వారీ చేయడం నేర్చుకున్నాడు మనిషి పనిముట్ల వాడకం నేర్చుకున్నాడు. ఆనాటి పనిముట్లు పదునైన రాళ్లు ,ఎముకలను వాడిగా చెక్కిన కర్రలు. పనిముట్లతో మొట్టమొదటి జరిగిన కార్యక్రమం పోగుచేయడం. పళ్ళు కాయలు, దుంపలు పక్షుల గుడ్లు పోగు  చేసుకుని తినేవారు . మనిషి దీంతో జంతు ప్రపంచం నుంచి వేరు పడ్డాడు.

నిప్పుతో నాగరికత

         మనిషి మానవనాగరికతలో  నిప్పు కీలకమైనది.నాలుగు లక్షల సంవత్సరాల క్రితం మనిషి   దీనిని కనుక్కున్నాడు.రెండు ఎండిన చెట్లు రాపాడు కొని అగ్ని పుట్టి చెట్లు కాలి పోయేవి.దానిని చూచి మొదట్లో ఇతర జంతువుల మాదిరిగానే  భయపడేవాడు. కాలక్రమంలో  అది వేడిని ఇస్తుందని క్రూర మృగాలు నుండి కాపాడుతుందని తెలుసుకున్నాడు. దాంతో మండే అడవుల నుండి, అగ్నిపర్వతాల నుండి దివిటీ వెలిగించుకుని అవి ఆరిపోకుండా కాపాడుకుంటూ వచ్చాడు.
            మనిషి జీవితంలో నిప్పు చాలా ప్రధానమైంది. మనిషికి మాత్రమే పట్టుబడిన శక్తి అది. భారతం రచనా కాలంలో దానిని అరణి అనేవారు. నిప్పును ఉపయోగించి ఆహారం ఉడికించడం, కాల్చడం చేసేవాడు. కాల్చిన మాంసం తినడం వలన మనిషి దంత స్వరూపం మారుతూ వచ్చింది.    
        నిప్పుతో జంతువులను భయపెట్టి లొంగదీసుకోవడం మొదలుపెట్టాడు. అగ్ని ని నాశనకారిగా కాక  పదార్థాలను మార్చివేయగల ఒక మాంత్రిక శక్తి గా భావించారు. అగ్ని నాశనం చేయదు అది పునర్జన్మ నిస్తుందని భావించేవారు.వాస్తవానికి
ప్రాణం లాగే నిప్పు (అగ్ని )కూడా పదార్థం కాదు. నిప్పు ఒక పరిణామ ప్రక్రియ. దీనివల్ల ఒక పదార్థ స్వభావం మారిపోతుంది. నిప్పుకు ఆక్సిజన్ కు సంబంధం ఉంది.
              రాళ్లను పగలకొట్టడానికి , వంటకూ నిప్పును వాడినారు. లోహాల శుద్దికి వాడినారు.దాంతో రాతి పనిముట్లు బదులు లోహపు పనిముట్లు కూడా వచ్చాయి.  
          అగ్నిని ఒక అతీత శక్తి గా భావించడం మొదలు పెట్టాడు. 
          నిప్పు ద్వారానే  మనిషి హిమయుగం లో మనుగడ సాగించగలిగాడు. ఈ విధంగా నిప్పు మానవ నాగరికతలో ప్రధాన పాత్ర వహించింది.

జంతువులతో అదనపు ఉత్పత్తి___గణ సమాజాల ఆవిర్భావం

జంతు ప్రపంచం నుండి విడివడే క్రమంలో నిప్పు కనుగొన్నాక ఆహారపు అలవాట్లు మారడం వల్ల ప్రకృతితో జరిపే సంఘర్షణ వల్ల మనిషి మెదడు మార్పు చెంద సాగింది.
జంతువులను మచ్చిక చేసుకోవడం క్రమబద్ధంగా నేర్చుకున్నాడు. కుక్క లు,పిల్లులు, కుందేళ్ళ లాంటి జంతువులు సులభంగా మచ్చికయ్యాయి. ఉదాహరణకు ఒక కుందేలును మచ్చిక చేసుకుంటే దాని నుండి పది కుందేళ్ళు పుట్టేవి. ఇది అదనపు ఉత్పత్తి గా మారింది.అంటే వారికి తగినంత ఆహారం ఉండడమే గాక మిగులు కూడా ఏర్పడింది.ఇలా వాటిని ఉపయోగించు కోవడం నేర్చుకోవడంతో అదనపు ఉత్పత్తి సాధ్యమైంది.
    గుర్రాలను మచ్చిక చేసుకుని వాటిపై 
 స్వారీ చేయడం వల్ల మనిషి  ఇతర ప్రపంచం పై  చేయి సాధించాడు. కుక్కల లాంటి జంతువులను   ఆహారాన్ని సంపాదించడం లాంటి పనులలో  ఉపయోగ పెట్టడం తో కొంత అదనపు ఉత్పత్తిని మనిషి సాధించ గలిగాడు.
         ‌ గుహలలో చెట్టు తొర్రలలో తలదాచు కునే వారు. క్రమంగా ఎముకలతో ను చర్మాలతో ను చెట్ల ఆకులతో గుడిసెలు వేయడం నేర్చుకున్నారు. ఆడ, మగ మధ్య పని విభజన జరిగింది. మగవారు చేపలు పట్టడానికి వెళ్లేవారు. ఆహార సేకరణకు స్త్రీలు వెళ్లేవారు. పళ్ళు, కాయలు ,గింజలు సేకరించేవారు .సేకరించిన వాటిని భద్రపరిచే వారు. అందుకోసం బుట్టలు అల్లేవారు. ఇదంతా ఆనాటి సమాజ నిర్వహణలో స్త్రీల పాత్ర ఎంతో తెలియజేస్తుంది. వారికి ఆనాడు అత్యంత గౌరవం ఉండేది. క్రూర మృగాల నుండి తప్పించుకోవడానికి గుంపులు గుంపు లుగా బతికేవారు.దీనిని గుంపు సమాజం అన్నారు. గుంపులు గుంపులుగా ఉండటం వల్ల  పెద్ద పెద్ద జంతువులను వేటాడటం సాధ్యమయ్యేది. నిప్పును ఆరిపోకుండా చూసుకోవడం సాధ్యమయ్యేది. కలిసి వేటాడేవారు గనుక ఒకరితో ఒకరు తమ భావాలను చెప్పడానికి మాట్లాడాల్సిన అవసరం ఏర్పడింది. భావాలను ఇతరులకు తెలియజేయడం కోసం మొదట చిన్న చిన్న శబ్దాలతో చెప్పేవారు.  క్రమంగా వారి అరుపులు వివిధ వస్తువులకు సంకేతాల య్యాయి.అదే మెల్లగా భాషగా మారింది.
           గుంపులు గా ఉన్న సమాజాన్ని గణ సమాజం అన్నారు. ఈ గణ సమాజం నిరంతరం సంచరిస్తూ ఉండేది. వీరు ఇతర గణ సమూహాలపై పడి వారు సేకరించిన ఆహారాన్ని దోచుకునేవారు.ఇలా దోచుకోవడం క్రీ.పూ 10 వేల ఏళ్ళనాడే ప్రారంభమైంది.
క్రీ పూ 2000లో ఆర్యులు ఇరాన్ నుంచి వచ్చి  ఇండియాలోని సింధు నాగరికత ప్రజలపై దాడి చేసి వారి ఆస్తులను ధ్వంసం చేసి వారి గోవులను దోచుకున్నారు.

గణసమాజం, మాతృస్వామిక సమాజంగా మారిన క్రమం

     సంచార జీవితం గడిపి ఆహార సేకరణ చేసుకుని జీవించే గణ ప్రజలు భూమి లో విత్తనాలు చల్లి దాని నుండి మళ్లీ పంటను ఉత్పత్తి చేయడం నేర్చుకున్నారు.ఇలా వ్యవసాయం చేయడం ప్రారంభించింది స్త్రీలే .ఆహారం కోసం గింజలు సేకరించే పనిని స్త్రీలు చేసేవారు. మెత్తటి నేలలో గింజలు పడితే అవి మొలకెత్తి మొక్కలుగా మారి ఎన్నో గింజలు ఇస్తాయని తెలుసుకున్నారు. నేలను తవ్వి  గింజలు నాటడం ప్రారంభించారు. తవ్వడం కోసం కొయ్య నాగలిని   కనుగొన్నారు. చెట్లు నరకడానికి గొడ్డలి, కోయడానికి కొడవలి ,రాళ్ళతో తయారు చేసేవారు .

          దీంతో  గణ సమాజం వ్యవసాయక సమాజంగా మారింది.అప్పటి నుండి ఒకే చోట ఉండి వ్యవసాయం చేయడంతో స్థిర జీవితం ప్రారంభమైంది. కొన్ని గణాలు దగ్గర దగ్గరగా
 స్థిరపడి అవి తెగలుగా పరిణమించాయి. తెగలోని వారందరికీ ఒకే భాష ఒకే ఆచారం ఏర్పడ్డాయి. వ్యవసాయం,చేతివృత్తుల్లో స్త్రీల పాత్ర అధికంగా ఉండేది. 
         తెగలోని వారి మధ్య వచ్చే తగవులు తీర్చడానికి తెగకు ఒక పెద్దల సమితి నాయకత్వం వహించేది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఆ నాయకు లందరూ కూర్చునేవారు. పెద్దల సమితిలో పురుషులకు స్త్రీలకు మధ్య తేడా ఏమీ లేదు.  
        
           స్త్రీ లు కుండలు చేయడం,పీచు నుండి తర్వాత కాలంలో పత్తి నుండి నూలు తయారు చేయడం, నూలు బట్టలు నేయడం నేర్చుకున్నారు.బుట్టలు అల్లడం కూడా నేర్చుకున్నారు.  దాంతో వారికి సహజంగానే నాయకత్వంలో కూడా స్థానం లభించింది.   

             స్త్రీలు సంతానాన్ని కనేవారు. పెంచేవారు. వారిదే ఆధిపత్యం.తండ్ర ఎవరో కూడా తెలిసేది కాదు.మాతృస్వామిక వ్యవస్థ ఉండేది.సంతానానికి గుర్తింపు తల్లి నుండి వచ్చేది.
          స్త్రీ పురుష సంబంధాలలో స్వేచ్ఛ ఉండింది.వావి వరుసలు లేని ఆ పరిస్థితిలో ఏర్పడిన తొలి కుటుంబ రూపం రక్తసంబంధీ కుల కుటుంబం.తర్వాత కాలంలో దీని పై నిషేధం విధించు కున్నారు. వేరువేరు తరాల స్త్రీ పురుషుల మధ్య వివాహ సంబంధం నిషిద్ధమైంది. తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య వివాహ బంధం నిషేధించబడింది. ఈ కుటుంబ రూపాన్ని ఫ్యూనలాన్ కుటుంబం అంటారు. ఈ నిషేధానికి తోడు ఒకే తరానికి చెందిన వారిలో  తోడబుట్టిన వారి మధ్య వివాహబంధం నిషేధింపబడినది.రుగ్వేదంలో లో అన్నా చెల్లెలు అయిన యమ, యమి ల మధ్య దీనిపై చర్చ జరుగుతుంది. పై రెండు రకాల కుటుంబ రూపాలు గుంపు పెళ్లి రూపాలు. అందువలన బిడ్డను తల్లి వైపు నుండి గుర్తించేవారు.ఆ దశలో  ఆ సమాజాలు అనేకం మాతృస్వామిక సమాజాలుగా ఉండేవి. మాతృస్వామిక సమాజంలో ఇంటి పేరు తల్లి వైపు నుంచే ఉండేది. ఉదాహరణకు గౌతముడు(బుద్ధుడు).గాంగేయుడు(భీష్మ), అంజనీ పుత్రుడు (హనుమ), కౌంతేయ (కుంతికొడుకు).
            ప్రతి గణానికి ఒక ఆది మాత ఉండేది.ఆదిమాతకు కూతుర్లు కొడుకులు ఉంటారు. కూతుర్లకు పుట్టిన సంతానమే గణంలోని సభ్యులు.కొడుకుల వల్ల కలిగిన సంతానం వేరొక గణంలోని  స్త్రీల సంతానం. అందువల్ల ఆ సంతానం వేరొక  గణం కిందకు వస్తారు వస్తారు. గణానికి ప్రత్యేకమైన పేరు ఉండేది. గణానికి ఉమ్మడి ఆస్తి ఉండేది.

         గణంలోని స్త్రీ పురుషుల మధ్య వివాహ బంధం నిషేధింపబడింది. దాంతో ఒక గణం ఇంకో గణంతో సంబంధం కలిగి ఉండాల్సిన అవసరం ఏర్పడింది .ఆ రకంగా కొన్ని గణాలు కలిసి తెగగా మారాయి.
            పనిముట్లు అభివృద్ధి చెందని దశలో ఉత్పత్తి తక్కువగా ఉండేది. అంటే ఆసమాజం లో సంపద తక్కువగా ఉంటుంది. ఆ దశలో స్త్రీ పురుష సంబంధాల ప్రాబల్యం అధికంగా ఉన్నట్లు కనబడుతుంది.
        వ్యవసాయం చేయడానికి ప్రారంభంలో రాతి పనిముట్లు  ఉపయోగించేవారు. ఆ తర్వాత నాగలిని కనుగొన్నారు. నాగలితో ఎక్కువ భూమిని సులభంగా సాగు చేయ గలిగారు. భూమి ఉమ్మడి ఆస్తిగా ఉండేది.ఎవరు సాగు చేసుకుంటే వారిదే ఆ భూమి. భూమిపై హక్కు ఎవరికీ లేదు.స్వంత ఆస్తి అంటూ లేని సమాజమది.

మాతృస్వామిక సమాజం, పితృస్వామిక సమాజంగా మారిన క్రమం

         నాగలి వాడకం పెరిగాక వ్యవసాయంలో స్త్రీలు పాల్గొనడం కష్టమైంది. భూమిని దున్నడం పురుషుల పనిగా మారింది. సాంకేతిక అభివృద్ధి పెరిగేకొద్దీ పనిముట్లలో మార్పులు వచ్చాయి.రాతి పనిముట్లు పోయి,రాగి, ఇత్తడి, ఇనుము పనిముట్లు వచ్చే కొద్దీ సమాజంలో ఉత్పత్తి పెరిగి మిగులు ఏర్పడడం మొదలైంది.ఆ మిగులు పై వ్యక్తిగత యాజమాన్యం ఏర్పడింది. తయారైన ఉత్పత్తిపై స్త్రీకి యాజమాన్యం సంక్రమించింది. పనిముట్ల పై పశువులపై మగవారికి యాజమాన్యం సంక్రమించింది. ఉత్పత్తి స్థాయి పెరిగే కొద్దీ మగవారికి ఆస్తిపై యాజమాన్య హక్కు కూడా పెరుగుతూ వచ్చింది. అయితే ఆ ఆస్తిని తన సంతానానికి అందించే వారసత్వ హక్కు లేకుండా ఉంది. దాంతో ఉత్పత్తిపై తనకు పెరిగిన యాజమాన్యపు హక్కును వినియోగించుకుని మాతృస్వామిక సమాజాన్ని మగవాడు పితృస్వామిక సమాజంగా మార్చేశాడు. దీని కోసం తనకు అనుకూలంగా తగిన  సాహిత్యాన్ని తయారు చేసుకొని ప్రచారం చేసుకొన్నాడు.
        దాంతో మగవాని ఆస్తి అతని సంతానా నికి వారసత్వంగా చెందే పద్ధతి వచ్చింది. ఈ వ్యక్తిగత ఆస్తి హక్కును కాపాడుకోవడానికి గణసమాజ వ్యవస్థ పనికిరాకుండా పోయింది. అందువలన గణ సమాజాలు కలిసి తెగలుగా ఏర్పడిన పరిస్థితిలో అన్నీ కలిసి సమాఖ్యగా ఏర్పడ్డాయి. ఉత్పత్తి అభివృద్ధి చెందే కొద్దీ వ్యక్తిగత ఆస్తిని పెంచుకునే  క్రమంలో  గణ వ్యవస్థ విచ్ఛిన్నమైంది. గణం అంతా ఒకే కుటుంబం అనే పద్ధతి పోయి విడి విడి కుటుంబాలుగా ఏర్పడటం మొదలయ్యింది. గణాలన్నీ కలిసి తెగలుగా ఏర్పడ్డాయి అవి కూడా ఒక సమాఖ్యగా మారాయి. అనేక  సంవత్సరాల కాలంలో ఈ తెగలన్నీ కలిసి ఒక జాతిగా రూపొందాయి.

పితృస్వామిక సమాజంలో  స్త్రీల స్థానం

         మాతృస్వామిక సమాజంలో విశిష్ట అధికారాలు పొందిన స్త్రీ పితృస్వామిక సమాజంలో అధికారాన్ని కోల్పోయింది. పురుషుడికి సంతానాన్ని కని పెంచే సాధనంగా మారింది. స్త్రీలను పురుషుడి అదుపులో ఉంచుకోవడానికి అనేక ధర్మ శాస్త్రాలు రచించారు. పున్నామ నరకం నుంచి పుత్రుడు రక్షిస్తాడని ప్రచారం చేశారు.అన్ని కులాలకు సంబంధించిన స్త్రీలను, శూద్రులను ఒక గాటికే కట్టివేయబడినారు. స్త్రీలు ఉన్నత కులాలకు చెందినా, వాళ్లకు హక్కులు లేకుండా చేసినారు.న స్త్రీ స్వాతంత్ర మర్హసి అని మనుధర్మ శాస్త్రం చెబుతోంది .స్త్రీకి స్వతంత్రంగా ఉండే హక్కు లేదు . స్త్రీ  పురుషుడి ఆనందం కోసమే సృష్టించ బడిందన్నారు. చిన్నతనంలో తండ్రి , యుక్తవయసులో భర్త, వృద్ధాప్యంలోకొడుకు వీరికి అండగా ఉండాలి. పురుషుడు సన్యాసం స్వీకరించవచ్చు. స్త్రీలు చేయరాదు. ఎందుకంటే మరణించే వరకు స్త్రీ చాకిరీ చేయాలి కాబట్టి. ఇలా అనేక చట్టాలు చేసినారు.
          మగవాడు ఒక ఆడదానికి పరిమితం కాకుండా అనేక మందితో ఉండొచ్చు. స్త్రీకి మాత్రం ఒకే భర్త .దీనినే బహు భార్య పద్ధతి అన్నారు.రాజులు, జమీందారులు అనంత పురంలో చాలా మంది స్త్రీలను బలవంతంగా భార్యలు గానో, ఉంపుడుగత్తెలుగానో ఉంచుకునేవారు.ఎంతమంది ఎక్కువగా ఉంటే అంత గొప్ప రసికుడనే వారు.
        రాజు యుద్ధంలో మరణిస్తే అంతఃపుర స్త్రీలందరూ మరణించాలి .ఇదే సతీ సహగమన దురాచారం.ఇది బానిస, భూస్వామ్య సమాజాల్లో ఉండేది. స్త్రీలకు ఆస్తి హక్కు లేదు భర్త పోతే మళ్ళీ వివాహం చేసుకునే వీలు లేదు .గుండు తీయించు కోవాలి. హీనంగా చూసే వారు . ఇప్పటికీ కూడా చాలా చోట్ల చేస్తున్నారు.కొందరు స్త్రీలను రాజు లేదా జమీందారు    కోరిక తీర్చడానికి  దేవదాసీలుగా వేశ్యలుగా ఉంపుడుగత్తెలుగా మార్చబడ్డారు.వారిని ఉంచుకున్న మగవాళ్లను గొప్పగా చూసేవారు. కానీ ఉంపుడుగత్తెలను నీచంగా చూసే వారు.
           వ్యవసాయంలో చేతివృత్తుల్లో పురుషుడితో పాటు కష్టపడి పనిచేసే స్త్రీలు పురుషులతో పాటు సమాన హక్కులు పొందలేకపోయారు.
           ధర్మశాస్త్రాల ప్రభావం వలన సమాజంలో స్త్రీలకు సంబంధించి  అనేక మూఢవిశ్వాసాలు ,కట్టుబాట్లు, దురాచారాలు మొదలైనాయి. కట్టుబాట్లు ఇలా ఉండేవి.
పురుషుని ఎదుట పడకూడదు మేలిముసుగు ధరించాలి. పరదా పద్ధతి   పాటించాలి.
ముస్లింలలో ఇంకా ఇది ఉంది. పాఠశాలలో చేరి చదువుకోరాదు. ఆస్తి హక్కు లేదు. స్వతంత్ర జీవితం లేదు.సమాజంలో ఉన్న
దురాచారాలు అన్నీ ఇన్నీ కావు.ఎనిమిదేళ్ళ  లోపే  వివాహం చేసేవారు.రజస్వలైన స్త్రీలను ఇంటి బయట కూర్చోబెట్టే వారు.పెళ్లికి ముందు రజస్వల కారాదు. వరుడు వధువు కన్నా 20 నుంచి 80 సంవత్సరాల ఎక్కువ వయస్సు కలిగి ఉండేవాడు. అమ్మాయి యుక్త వయస్సులోకి వచ్చేటప్పటికి భర్త వయసు ఉడిగి పోయేది .ఎక్కువమంది మరణించే వారు.దాంతో చాలామంది వితంతువుల య్యేవారు. వితంతువులకు పునర్వివాహం నిషేధం.ఆస్తి హక్కు  లేదు గనుక ఇతరులపై ఆధారపడి దయనీయమైన జీవితాలు గడిపే వారు. కన్యాశుల్కం పేరుతో ఆడపిల్లల నమ్మేవారు.గురజాడ రాసిన కన్యాశుల్కం నాటకం దీని గురించే. మెల్లగా కన్యా శుల్కం పోయి వరకట్నం పద్ధతి  వచ్చింది.
ఈ పద్ధతి కూడా ఆడపిల్లల పాలిట గుదిబండలా తయారైంది.ఆడపిల్లలకు పెళ్లి చేయాలంటే వరునికి కట్నం ఇవ్వాలి . వర కట్నం తేలేదని ని వరకట్న హత్యలు మొదలయ్యాయి. కాళ్లకూరి నారాయణరావు రాసిన వరవిక్రయం దీని గురించే.భార్య మరణిస్తే పురుషుడు మళ్లీ పెళ్లి చేసుకోవచ్చు. భార్య మాత్రం భర్త పోతే సతీసహగమనం చేయాలి లేదా జీవచ్ఛవంగా బతకాలి.

స్వాతంత్రోద్యమం_ సంస్కరణ ఉద్యమాలు _ స్త్రీల భాగస్వామ్యం

           సమాజంలో లో స్త్రీలు సగభాగం అయినప్పటికీ స్వాతంత్రోద్యమంలో  మహిళ ల పాత్ర తక్కువగా ఉండేది. మహిళలను భాగ స్వామ్యం చేయకుండా స్వాతంత్రం సాధించ లేమని  నాయకులు గుర్తించారు.దీనికి ఆటంకంగా  సమాజంలో ఉన్న దురాచారాలు కట్టుబాట్లు ఉన్నాయని  అర్థం చేసుకున్న నాయకులు సమాజంలో సంస్కరణలకు నడుం కట్టారు. ఆర్య సమాజం ,బ్రహ్మ సమాజం మొదలైన సామాజిక సంస్థలు హిందూ ముస్లిం  మతాలలో వున్న మూఢాచారాలను ,కట్టుబాట్లను ఎదిరించాలని అనేక సామాజిక ఉద్యమాలు చేపట్టాయి. దళితుల పట్ల వున్న సామాజిక అంటరానితనాన్ని పోగొట్టాలని ప్రచారం చేశారు. స్త్రీ పురుషులు సమానం అన్నారు. దయానంద ఈశ్వరచంద్ర విద్యాసాగర్ రామకృష్ణ పరమహంస వివేకానంద రాజారామమోహన్ రాయ్ కందుకూరి రఘుపతి వెంకటరత్నం గురజాడ వంటి సంస్కర్తలు స్త్రీ విద్య, బాల్యవివాహాల నిషేధం, సతీసహగమనం, స్త్రీల పునర్వి వాహం ,కన్యాశుల్కం రద్దు, వరకట్న నిషేధం వంటి దురాచారాలపై ఉద్యమాన్నినిర్మించారు. ఈ విషయంలో ఆంగ్లేయుల విద్యా విధానం కూడా తోడ్పడింది.ఈ ఉద్యమాల మూలంగా స్వాతంత్ర్యోద్యమంలో కి చాలామంది యువతీయువకులు అడుగు పెట్టారు. జాతీయ నాయకుల ప్రోత్సాహంతో చాలామంది స్త్రీలు నాయకత్వంలోకి వచ్చారు. అనిబిసెంట్ ,సరోజినీ నాయుడు వంటి మహిళలు కాంగ్రెస్ నాయకులుగా ఎదిగారు.  కమ్యూనిస్టు ఉద్యమంలో కూడా చాలా మంది స్త్రీలు ముందుకొచ్చారు. అరుణా అసఫ్ అలీ, కల్పనా రాయ్, కెప్టెన్ లక్ష్మీ సెహగల్ మొదలైనవారు కమ్యూనిస్టు ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో   చాకలి ఐలమ్మ , మల్లు స్వరాజ్యం లాంటి మహిళలు తుపాకులు వడిసెలు చేతబట్టి  భూస్వాము లకు వ్యతిరేకంగా పోరాడారు.
         స్వాతంత్రం సాధించాక మన దేశ నాయకుల ఆధ్వర్యంలో   పార్లమెంటును రాజ్యాంగాన్ని ఏర్పాటు చేశారు . పార్లమెంటుకు ఎక్కువ భాగం భూస్వాములు పెట్టుబడిదారులు ఎన్నికయ్యారు .వారు తీసుకున్న విధానాల ఫలితంగా స్త్రీలకు అట్టడుగు వర్గాలకు న్యాయం జరగలేదు. అసమానతలు పెరిగాయి. కొద్దిమంది కోటీశ్వరుల చేతుల్లోకి కోట్లాదిఆస్తులు భూస్వాముల చేతుల్లోకి వేల ఎకరాల భూములు  వచ్చాయి. అందరికీ అవసరమైన  విద్య, వైద్యం , తిండి, వసతి చాలామందికి అందని మావిపండుగా మారాయి.  
       మహిళలకు వైద్య సదుపాయాలు అందక ప్రసూతి మరణాలు బాగా పెరిగాయి. చాలా మంది మహిళలకు  చదువు దూరమైంది. చదువుకున్న స్త్రీలకు ఉపాధి కరువైంది. మగవాడికి ఇచ్చే కూలి కన్నా స్త్రీలకు ఇచ్చేది తక్కువ. తరతరాల నుంచి వస్తున్న పురుషాధిక్యత  కొనసాగుతోంది. వరకట్న సమస్య తో అమ్మాయి అభిరుచులకు కోరికలకు ఆస్కారం లేకుండా పోయింది. చాలామంది మహిళలు వరకట్న సమస్య కు బలవుతున్నారు.  చాలా మంది ముస్లిం స్త్రీలు భర్తల ద్వారా దగా పడుతున్నారు. ఆడపిల్ల పుడితే శాపం,మగ బిడ్డ పుడితే వరం అనే విధంగా తయారయింది . పున్నామ నరకం నుండి తమను కొడుకు రక్షిస్తాడనే అనే మూఢనమ్మకం ఇంకా సమాజంలో ఉంది. అందుకే అబ్బాయి పుట్టాలని ఇంకా కోరుకుంటున్నారు. దళిత  మహిళలను పూచికపుల్లతో సమానంగా చూస్తున్నారు.

రాజ్యాంగ హక్కులు _మహిళలు

భారత రాజ్యాంగం  మహిళలకు పురుషులతో పాటు సమాన హక్కులు ఇచ్చింది. పురుషాధిక్య సమాజం మాత్రం దీనిని ఇంకా జీర్ణించుకోలేకుండావుంది. సమాజంలో  రాజకీయంగా, కుటుంబపరంగా తీసుకొనే నిర్ణయాలలో మహిళలకు ఎటువంటి భాగస్వామ్యం లేదు. కుటుంబ బాధ్యతలు ఎంత మోస్తున్నా వారి అభిప్రాయాలకు కొంచెం కూడా విలువ ఇవ్వడం లేదు.
 సమాన హక్కుల ని ఎంత గొంతు చించుకున్నా మహిళలకు ఇంటా బయట ఎటువంటి అధికారాలు లేకుండా చేస్తున్నారు.   పౌష్టికాహారం లేమి కారణంగా రక్తహీనతతో మహిళా వర్గం బాధపడుతోంది .ఇంటి పని తో, బయట పనితో సతమతమవుతోంది మహిళ. మహిళలే వంట చేసినా ఆహారాన్ని మగవాడే ఎక్కువభాగం తీసుకోవడం వల్ల ఆమె తక్కువ తీసుకుంటోంద.దాంతో  పోషకాహారం తగ్గి అనేక రోగాలకు గురవుతోంది. ప్రసూతి మరణాలకు,శిశు మరణాలకు ఇది ప్రధాన కారణంగా ఉంది. 2005 ఆరోగ్య  మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం  మగ శిశువుల మరణాలు కన్నా ఆడ శిశు మరణాల సంఖ్య 61 శాతం అధికంగా ఉంది.
14 ఏళ్ల లోపు పిల్లలందరికీ విద్య గ్యారెంటీ చేయబడినా, కేవలం 39 శాతం మంది బాలికలు మాత్రమే పాఠశాలలకు హాజరవుతున్నారు. 6 నుండి 17 మధ్య వయసు ఉన్న బాలికల్లో కేవలం 2/3 వంతు బాలికలు మాత్రమే పాఠశాలలకు వెళుతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న మహిళల్లో కేవలం 46 శాతం మంది మాత్రమే అక్షరాస్యులుగా ఉన్నారు.ఇలా చదివిన  అమ్మాయిలకు సరైన ఉద్యోగాలు కూడా దొరకడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఎక్కువ భాగం వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నారు వీరు ఉదయం  5 నుంచి 10 వరకు సాయంత్రం 3 నుంచి 6 వరకు పని చేస్తారు .వాళ్ళు ఎంత బాగా పని చేసినా మగవాళ్ళు మాత్రం' ఆడవాళ్ళు బాగా తింటారు .పని మాత్రం చేయరు' అని  అంటుంటారు.
25%  మంది మహిళలు పదిహేనేళ్లలోపు వయస్సు లోనే పెళ్లి చేసుకుంటున్నారు .ఈ పెళ్లి చేసుకోవడంలో వారి అభిప్రాయాలకు ఎలాంటి విలువా లేదు. దీనికితోడు వారు గృహహింసకు, దోపిడీకి, నిర్లక్ష్యానికి గురవుతున్నారు. 2007 తర్వాత మహిళల స్థితిగతుల్లో కొంత మార్పు వచ్చింది. 1950 లో రిపబ్లిక్ గా మారిన తర్వాత దేశ చరిత్రలో ప్రతిభా పాటిల్ గారు మొట్టమొదటి మహిళారాష్ట్రపతి  అయ్యారు. 
1992లో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక సంస్థల్లో 33 శాతం నుండి 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం వల్ల దాదాపు 14 లక్షల మంది మహిళలు బాధ్యతల్లో ఉంటున్నారు .అలాగే 1996 నుండి  చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కావాలని ఆందోళన చేస్తున్నా దానికి సంబంధించిన బిల్లు ఇంకా పెండింగ్ లోఉంది. 15వ లోక్ సభలో మహిళా ప్రాతినిధ్యం 543 మంది లో 61 ఉండగా రాజ్యసభలో 240 గాను 20మంది మాత్రమే ఉన్నారు. మనకన్నా ఆఫ్రికా దేశాలైన రువాండా, ఉగాండా, సుడాన్ పార్లమెంటుల్లో మహిళల పాత్ర ఎక్కువగా ఉంది.

ప్రపంచీకరణలో స్త్రీలు

యంత్రాలు కనుగొన్నాక వచ్చిన పరిశ్రమలతో ఉత్పత్తి పెరిగి పెట్టుబడిదారీ విధానం బాగా అభివృద్ధి చెందింది. పెట్టుబడిదారీ విధానంలో అన్ని వస్తువులతో పాటు స్త్రీ కూడా ఒక సరుకుగా మారిపోయింది. ఒక డబ్బు సంపాదించే పనిముట్టుగా అయింది.సమాజంలో డబ్బు పాత్ర విపరీతంగా పెరిగాక డబ్బు స్త్రీ పురుష సంబంధాలను నిర్ణయించే పరిస్థితి వచ్చింది. స్త్రీ పురుష సంబంధాలను వారివురి అభిరుచులు, ఇష్టాయిష్టాలు బట్టి గాక డబ్బులను బట్టి నిర్ణయించి నిర్వహించడం జరుగుతోంది. పెట్టుబడి విస్తరణలో భాగంగా వచ్చిన ప్రపంచీకరణ మహిళలు పురుషుల లైంగిక అవసరాలను తీర్చే సరుకులుగా, ఉత్పత్తుల ప్రచార సాధనాలుగా  మార్చివేసింది. సరికొత్తగా సరోగసి (గర్భాన్ని అమ్ముకోవటం )కూడా ఎగుమతి అవుతున్న సేవ గా నిలిచింది .మగవారి మితిమీరిన లైంగిక దాహం మహిళల జీవితాల్లో చీకట్లను నింపుతోంది .వీధుల్లో రక్షణ కరువవుతోంది .మద్యం మత్తులో మహిళల పై యువత చేస్తున్న హత్యాచారాలకు అంతులేకుండా ఉంది.   ఢిల్లీలో జరిగిన  నిర్భయ ఉదంతం భారత దేశాన్ని కుదిపేసింది.
 ఇంకో పక్క స్త్రీ అనుభవాన్ని బజార్లో కొనుక్కోగలిగే వ్యభిచారం అమలులోకి వచ్చింది. అశ్లీలత ,అందాల పోటీలు పెరిగాయి బహుళజాతి సంస్థలు వ్యాపారాల కోసం స్త్రీని అడ్డం పెట్టుకుని వ్యాపారం చేస్తున్నాయి. ప్రపంచీకరణ విస్తరణకు సాధనంగా ఉన్న
  టీవీ ,ఇంటర్నెట్ ,సెల్ ఫోన్, సోషల్ మీడియా లలో అనేక  అశ్లీల చిత్రాలను చూపించడం ద్వారా మహిళలపై అనేక అఘాయిత్యాలు పెరుగు తున్నాయి. ఇవి నేరాలు-ఘోరాలు ,కుతంత్రాలు నేర్పించే సాధనాలుగా మారాయి .ఇవన్నీ మహిళలపై విపరీత ప్రభావం కలిగిస్తున్నాయి. పైగా టీవీలలో స్త్రీలను విలన్లుగా చూపిస్తూ స్త్రీకి స్త్రీయే శత్రువు అని ప్రచారం చేస్తూ ఉన్నాయి.
ప్రపంచీకరణ ప్రభావం తో వినిమయతత్వం బాగా పెరిగింది .వాయిదాల పద్ధతిలో ఇంటినిండా సామాన్లు కొనడం, ఆ తర్వాత ఆర్థిక సమస్యలు పెరిగి కుటుంబంలో కలహాలు రావడం ,అప్పుల బాధలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడం పరిపాటి అయింది. ఇదంతా ఎక్కువగా మధ్య తరగతి వర్గం లో జరుగుతోంది
ఈ వర్గం లో నుంచే అమ్మాయిలు సేల్స్ గర్ల్ గా కూడా పని చేయడం మొదలైంది .వ్యవసాయ రంగంలో పని చేస్తున్న మహిళలు వ్యవసాయం సంక్షోభంలోకిపోవడం కారణంగా పనులు లేక  వలసలు పోతున్నారు. పట్టణాలకు వలస వెళ్లిన  వారిలో ఎక్కువ మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. కొంతమంది మహిళలు పనుల కోసంకువైట్, మస్కట్ మొదలైన విదేశాలకు  వెళ్లడం వల్ల ఆరోగ్యంతో పాటు కుటుంబ వ్యవస్థ కూడా దెబ్బతింటోంది. వలస వెళ్లిన కుటుంబాల పిల్లలకు గ్రామాలలో సరైన ఆదరణ లేక అనేక చెడు అలవాట్లకు లోనై దారి తప్పుతున్నారు.

                     

Comments

Popular posts from this blog

ప్రభుత్వరంగం -మహిళలు

రాజ్యాంగ హక్కులు _మహిళలు